విభజన గాయాలు(గేయం)
**విభజన గాయాలు(గేయం)**
దగాబడ్డ సీమాంధ్రుడా!
పగ రగిలే సింహమై గర్జించరా!
ఎన్నాళ్ళీ మోసాలు!
ఎన్నెన్ని అవమానాలు!
నీలోని చైతన్యం మేల్కొల్పుకో!
ఉద్యమాన నీ హక్కులు సాధించుకో!
1.మొన్నేమో మదరాసు నిన్నేమో హైదరబాదు
మనవే అని అనుకొన్నాం మన చెమటతో నిర్మించాం
వరుస వరుస వంచనలు మన గూడును దోచేయగ
దేశరాజకీయాలకు అలుసయ్యెను ఆంధ్రజాతి
తరిమేసెడి ఛీత్కారాలు తలుచుకోర ఒకసారి
విభజన వేదనలన్నీ వినిపించర మరోసారి ॥
2.అమరజీవి ఆత్మార్పణ మపహాస్యం చేయబడి
కుటిల రాజకీయాల కుళ్ళంతా ఒక్కటయ్యి
చేవలేని మన నేతల చేతగాని తనం వలన
పెద్దరికం ప్రశ్నించని కౌరవసభ రాజనీతి
బలవంతపు విడాకులతో తెలుగు నేలనే చీల్చగ
ఆ నిర్భంధపు విభజనకు ఘొల్లుమనె సీమాంధ్ర
3.విభజన చట్టము లోన వినిపించిన తాయిలాలు
దాటవేస్తూ దగాచేస్తూ దారుణాలు చేస్తుంటే
మౌనాన్ని వీడకుంటే మనుగడే లేదు నీకు
టంగుటూరి అల్లూరికి వారసులం మేమంటూ
నీ జాతి పౌరుషాన్ని నినదించి చాటరా!
నీ ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చెప్పరా! ॥
*********
రచన: కప్పగంతు జయరామయ్య (2019)
పొందూరు.
Comments
Post a Comment