వానమ్మా!రావమ్మా!(గేయం)
* వానమ్మా!రావమ్మా! *(గేయం) వానమ్మా!వానమ్మా!రావమ్మా!వానమ్మా! వానమ్మా!వానమ్మా!రావమ్మా!వానమ్మా! రావమ్మా!వానమ్మా!మాబతుకులు నిలుపమ్మా! వానమ్మా!వానమ్మా!రావమ్మా!వానమ్మా! నిన్ను నేలమ్మను నమ్మి నాగేలు పట్టేటోళ్ళం ఇంటిల్లపాది చెమట శ్రమశక్తిగ మార్చేటోళ్ళం మెట్టభూముల్లోనే మెతుకులు పండించేటోళ్ళం అందరికి అన్నం పెట్టి ఆకలిని తీర్చేటోళ్ళం జీవనమే జీవితమంటూ జీవించేవాళ్ళం అమ్మా కల్తీమందులతోటి కష్టాలు ఎదురవుతున్నా మొలకెత్తని విత్తుల మోసం మా ఆశలు తుంచేస్తున్నా ధర గిట్టుబాటు లేక మా అప్పులు తీరకున్నా మనువాడ మా బిడ్డలను మరి అందరు వద్దంటున్నా సేద్యాన్నే వదలని వాళ్ళం! గ్రామాలను విడువని వాళ్ళం చిత్త స్వాతికార్తెల చినుకు రాలకపోయె! పదునయ్యే అదనుకాలం పరిగెత్తిపోతా ఉండె ఎండుదుక్కి తడవలేదు ఎద్దులు రంకెయ్యలేదు నల్లనిమేఘం కోసం నాలుగు దిక్కులు చూస్తూ దిగజారిన గుండె ధైర్యం దీనంగా వేడుతు ఉంది. రచన: కప్పగంతు జయరామయ్య (Oct 2018) పొందూరు - Phone: 9912117372