విరహానందం[కవిత]
**విరహానందం** [కవిత]
పసితనంలో పరిఢవిల్లిన స్నేహం
చిలిపి తగాదాలలో చిగురించిన అనురాగం
అనురాగపు ఆలంబనతో అవతరించిన అమలిన ప్రణయం
మౌనభావనల మురళిగానం వినిపించిన మోహనరాగం
చూపులతోనే చెప్పుకొన్న ప్రేమఊసులు
మూగభాషలలోనే మురిపించే సరసాలు
అతని మాట పాలించుటే ఆమెకు వేదం
ఆమె సాంగత్యంలో విహరించుటే అతనికి ప్రాణం
నవ్వుల పువ్వులతో
ఆశల అక్షతలతో
వరిపోచల విరిమాలలతో
ఇంకుల వసంతాలతో
అవధులు దాటని యవ్వనాలు
పెనవేసుకొన్న ప్రణయ బంధం
మనసులతో మనువాడాలనుకొంది
విద్యార్జనే తొలి విద్యుక్త ధర్మమై
పైతరగతులకు సాగిన ప్రయాణం
ప్రేమ పిపాసులను విడదీసి
ప్రణయ వృక్షంపై పిడుగును రాల్చింది
మూగ రోదనలోనూ మూతపడని చదువులు
విరహవేదనలోనూ వీడని బాధ్యతలు
కాలగమనంలోనూ కాంతులు తగ్గని ప్రేమజ్యోతులు
పరిస్థితుల ప్రాబల్యం ప్రణయానికి విడాకులిచ్చింది.
మారిన సంఘటనలు మరొకరితో మనువు జరిపించింది
అల్లుకొన్న ప్రేమగూడు చెదిరినా
ప్రేమజంట బెదరలేదు
ఆత్మహత్యల ఆగడాలు
అశ్లీలపు అరాచకాలు
తరగతి గదిలో తంతుధారణలు
యాసిడ్ దాడుల పైశాచికాలు
విరహాగ్నితో వింత వ్యసనాలు
కడుపు తీపిని కబళించే క్రూరచేష్టలు
పవిత్రప్రేమకు ప్రతిరూపాలు కాదని
తమ్ము తామే ఓదార్చుకొంది
ప్రణయ త్యాగాలకే ప్రణమిల్లి
త్యాగాలలో తీపిని ఆస్వాదిస్తూ
వీడని తలపులే విరహానందమై
సరికొత్త కమనీయ స్నేహబంధంగా
ఆ ప్రేమభావనలు రచించిన ప్రేమాయణం
ప్రేమిక లోకానికే అమృత సందేశం
నవీన ప్రేమికుల భావనకు
కావాలి ఇదే తొలి చరితం
*********
రచన: కప్పగంతు జయరామయ్య (2008)
పొందూరు - Phone: 9912117372
Comments
Post a Comment