ఏది తల్లీ భారతీయత! (గేయ కవిత)
* ఏది తల్లీ! భారతీయత *
ఏది తల్లీ! ఏది తల్లీ! నీవు పెంచిన భారతీయత
ఏది తల్లీ! ఏది తల్లీ! నీవు నేర్పిన సత్యసంధత
ఏది తల్లీ! ఏది తల్లీ! ..... ఏది తల్లీ! ఏది తల్లీ!
నిత్యకృత్యం హింసవాదం పడగ విప్పిన రాక్షసీయం
భాష కులములు ఆయుధాలుగ గద్దెనెక్కే సాధనాలై
రెచ్చగొట్టి రగుల్పొల్కే రాజకీయ దమన నీతిలో ॥
ధనమదాంధుల స్వార్ధపరుల దోపిడీలో నలుగుతున్న
నేటి విద్యాతల్లిప్రేమకు నోచుకోని బడుగు బాలురు
దారితెలియక దిక్కుతోచక దారి తప్పే వేళలందు ॥
ఆర్ధికంబగు పుష్టికోసం ప్రభుత మద్యం నాశ్రయించగ
ఎదురు తిరిగిన తెలుగుమహిళ గొంతు పిసికి పరిహసించిన
ప్రజాస్వామ్యపు ఏలుబడిలో ఉన్న భారతమిదా తల్లీ ॥
ఆడపడుచుల ఆర్తనాదం మోయలేని పన్నుల భారం
నింగికెగసెడి ధరల వెంబడి సాగలేని సగటు మనిషి
నడ్డివిరిగిన మధ్యతరగతి మనుగడే ప్రశ్నార్ధమైతే ॥
స్వల్పకాలిక స్నేహహస్తం అంతలోనే మిత్రభేదం
పదవి కోసం పాకులాటలు నీతిమాలిన పొత్తులు
సామ్యవాదమె కొత్తభాష్యం కోరుతున్న రోజులందు ॥
*********
రచన: కప్పగంతు జయరామయ్య (1999)
పొందూరు
Comments
Post a Comment