రాజకీయ కీకారణ్యం (కవిత)
* రాజకీయ కీకారణ్యం * (కవిత)
గ్రామీణ రాజకీయ కీకారణ్యం
వర్గ వైషమ్య క్రూరమృగ
గర్జనల భయారణ్యం
వర్గాధిపత్య రాజకీయ కుటిల నీతిలో
తల్లడిల్లుతున్న తటస్థ జీవాలు
వర్గ అస్పృశ్యతను ఆశ్రయిస్తూ
పాయలుగా చీలుతున్న ప్రార్థనా మందిరాలు
ముఠాపిచ్చి తలకెక్కితేనే
వినాయక నిమజ్జనాలు వైభవోపేతం
వికలాంగుడైనా వృద్ధురాలైనా
వర్గతీర్థం సేవిస్తేనే కాని
లభించని ఫించను ప్రసాదం
రాజీపదవుల పందారంలో
తటస్థ మేథావుల సేవాభిలాష
అడవిన కాచిన వెన్నెలలే!
అందలమెక్కుతున్న అసమర్ధ నాయకత్వం
ప్రత్యర్ధుల పతనమే ప్రధాన ప్రణాళిక
వర్గాభివృద్ధి వటవృక్షనీడలో
కునారిల్లుతున్న గ్రామాభ్యుదయం
పాలనాధికారుల పారదర్శకతపై
పైశాచిక స్వారీల పాలనాపర్వం
వర్గమద్యపానాలకు బానిసలవుతున్న
గ్రామీణ సామ్యవాద కోయిలలు
ఆపివేసిన అరుణరాగాలాపన
ఆలపిస్తున్న అన్ని రంగుల రాగమాలిక
పట్టణాల వ్యామోహం పల్లెల్లో బతకలేనితనం
వలస బాటలో మానవ నైపుణ్యాలు
పల్లె తల్లీ! నీ సీమ అభయారణ్యం
మరల ఎప్పుడవుతుంది?
*********
రచన: కప్పగంతు జయరామయ్య
[ Feb 2010 ]
పొందూరు - Phone: 9912117372
Comments
Post a Comment