తస్మాత్ !జాగ్రత్త![కవిత]
** తస్మాత్ !జాగ్రత్త [కవిత] **
అన్నమిచ్చి ఆకలి తీర్చి
అహోరాత్రులలుపెరుగని శ్రమకూర్చి
అన్నివృత్తులకాధార జీవన కేంద్రమై
గ్రామీణభారతానికి గరిమనాభియై
అలరించిన అన్నదాత
ఋణబాధలో ! రామచంద్రా!
అంటూ అరిచిన ఆక్రందనలు
బధిర శంఖారావాలై
అరిచి, విసిగి, వేసారి
దారుణమైన అప్పుల సంద్రాన్ని దాటలేక
దరి చేర్చే దయాగుణము కానరాక
ఆదరణకు దూరమై,అడ్డుకొనేవారు లేక
జన్మంటూ వుంటే రైతుగా జన్మించనని
శపధం చేస్తూ,శపిస్తూ
ఆత్మహత్యల ఆశ్రమానికి తరలిపోతున్నాడు
ఆగని అనునిత్యపు ఈ కర్షక మేధం
పరంపర బలవన్మరణాల విషాదం
దోపిడి దొంగల భయానక హత్యలు కావు
తీవ్రవాదం చేస్తున్న మారణకాండకాదు
న్యాయస్థానాలు విధించిన ఉరిశిక్షలు కావు
కడుపు నింపిన జాతిపై కృతజ్ఞతే లేని కసాయితనం వ్యవసాయమన్నది వృధా జీవనమైతే
కర్షకుడన్నవాడు కనుమరుగైతే
అవనియంతా అంతర్జాలాలు,ఆకాశ హర్మ్యాలైనా
అన్నమే దొరకని ఆ నవీన కాలంలో
పాలకులుండరు, ప్రతిపక్షాలుండవు
అదికాదా!అసలు ప్రజలే లేని యుగాంతం
ఇదికాదా!అర్ధాశలతో అసువులు బాపిన
రైతన్నలు హలంతో లిఖించి వెళుతున్న
అధునాతన జ్యోతిషాల దుర్ముహూర్తం
తస్మాత్ ! జాగ్రత్త
*******
రచన : కప్పగంతు జయరామయ్య (sep 2015)
పొందూరు , ప్రకాశం జిల్లా
Ph : 9912117372.
Comments
Post a Comment