కావాలి కదనారంభం (కరోనా కవిత-2)

https://www.youtube.com/watch?v=fwQBKiJbD-M
            * కావాలి కదనారంభం *

ప్రపంచమంతా వ్యాపించిన కరోనా
తూకమేస్తే ఒకటన్నర గ్రాములేనట
ఎంత అల్పజీవి కెంతటి అనంతశక్తి
భూలోకవాసులపై బహుముఖ సమరం
కనికరం లేని కరాళ కిరాత హననం
అగ్రరాజ్యాలు ఆర్తితో అల్లాడుతున్నాయి
అణ్వాయుధ దేశాలు హడలి చస్తున్నాయి
కళ్లెదుటే కనబడుతున్న శవాలగుట్టలు చూసి
హాహాకారాల రోదనలతో అలమటిస్తున్నాయి
భూగోళాన్నే క్షణాలలో బూడిద చేయగల
యుద్ధబాంబులున్న బడా బడా దేశాలు
వైరస్ విధ్వంసక విస్ఫోటనం దాటికి
నివ్వెరబోయి నీరసపడుతున్నాయి
కూలిన ఆర్ధిక సౌధాల క్రింద ఆకలి కేకల
ఆక్రందనలనోదార్చలేక తల్లడిల్లుతున్నాయి
పలు సేవారూపాలు ప్రాణాలకు తెగించి
అవిశ్రాంతంగా పోరాడుతూనే ఉన్నాయి
కర్కశ కరోనాకూ ఓ యుద్ధనీతి ఉంది
వాటేసుకొంటేనే వెంటబడి కాటేస్తుంది
స్వీయరక్షణకు తలవంచుతుంది
పరిశుభ్రతుంటే ప్రాణమిడుస్తుంది
ఏ కలుషిత సంపర్కమో కల్పిత పిశాచమో
మరే దుర్మార్గమో కరోనా జన్మకు కారణమైనా
విజ్ఞానవీరుల విశాల పరిశోధనకు తలొగ్గి
తన చావు రహస్యం మెల్లగా తానే చెప్తుంది
నివారణల దివ్యౌషధమూ అవతరిస్తుంది
అంతటితో ఆగరాదు ఈ కదనోత్సాహం
అదే కావాలి అసలైన కదనారంభం
జీవన వినాశకాలను విస్మరిస్తుంటే
విజ్ఞానఫలాల విలాసాలను నియత్రించకుంటే
పునరావృత మూలాలను పరిశోధించకుంటే
కరోనాలు మరలా పుడుతూనే ఉంటాయి
కల్లోలాలు సృష్టిస్తూనే ఉంటాయి
     
                         *****

            కప్పగంతు జయరామయ్య
            పొందూరు - మే 2020
            Phone : 9912117372
             ( మల్లెతీగ పత్రిక )

Comments