పల్లెవాసం (కరోనా కవిత -5)
కరోనా కవిత - 5
రచనా కాలం = జూన్ 2020
* పల్లెవాసం *
వేకువఝామునే నిద్రలేచే పల్లెతల్లి
కర్తవ్యాన్ని గుర్తుచేసే కోడికూతలు
కిర్రుమని సందడి చేసే బావి గిలకలు
వడివడిగా అడుగులేసే కావడి నడకలు
జొన్నలు దంచే రోకలి చప్పుళ్ళు
పొలమెళ్ళే ఎద్దుల గంటల గణగణలు
మచ్చుకైనా కనపడని మార్నింగ్ నడకలు
ఒకనాటి శ్రమైక జీవన సౌందర్య పల్లె జీవనం
ఆత్మీయ పిలుపుల ఆప్యాయతలు
పచ్చదనాల ప్రకృతి రమణీయతలు
చెట్టుక్రింద చర్చలలో పంటసాగు ప్రణాళికలు
గుడి లోని తాళం భజనల తన్మయత్వాలు
పౌరాణిక నాటక పద్యాల రాగాలాపనలు
సమిష్టి కుటుంబ మధురానుబంధాలు
పెద్దరికాన్ని గౌరవించే సత్సంప్రదాయాలు
ఉన్నత జీవనయానానికి మార్గదర్శనాలై
మానవ నైపుణ్యాల ఉత్పత్తి కేంద్రమై
పట్టణాభివృద్ధికి తానే పునాదులెత్తి
అలరించి ఆదర్శమైనది పల్లెవాసం
విలాస వ్యామోహమో ఉపాధి అవసరమో
తన బిడ్డలు రెక్కలొచ్చి తనను విడిచి
నగరాలకు పయనిస్తూ వలస పోతున్నా
పరిస్థితుల ప్రాబల్యానికి తలొగ్గి
గత కాలపు వైభవ చిహ్నంగా మిగిలి
ఆనంద భాష్పాలతో ఆశీర్వదించింది
ఆధునికతకిదే అసలైన మార్గమని
నగరవాసమే నాగరిక జీవనమని
తమకు తామే నాగరికులగా ఊహించుకొని
పల్లె భాషను పంచెకట్టును పల్లె నివాసాన్ని
అపహాస్యం చేస్తూ గతాన్ని మరుస్తున్నా
కడుపులో దాచుకొని మౌనం దాల్చింది
కరోనా భయానకమై భయపెడుతున్న వేళ
నగరవాసాన అభద్రత అలుముకున్న వేళ
వలసొచ్చిన బతుకు విడిచొచ్చిన ఊరి వైపు
దీనంగా చూస్తూ ఆశతో అడుగులేస్తుంటే
ఆహ్వానించి అక్కున చేర్చుకొని ఆదరించింది
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ!
*****
కప్పగంతు జయరామయ్య
పొందూరు - టంగుటూరు(మండలం)
ప్రకాశం-జిల్లా. Phone : 9912117372
June -2020.
Comments
Post a Comment