విషాదపర్వం (కరోనా కవిత - 6)

                   * విషాదపర్వం *

ఉన్నచోట ఉపాధిలేక ఊరు విడిచిన వలస కూలీ!
బతుకు కోసం మెతుకు వేటకు బయలుదేరిన బడుగు జీవీ!
గూడులేని అయినవారు కానరాని భాషరాని చోటుకెళ్ళి
కాయకష్టం చేసుకొంటూ కూలిబతుకు బతుకుతుంటే
ఉప్పెనల్లే వచ్చిపడిన మాయదారి మహమ్మారి
ఉన్నచోట ఉండనీయక సొంతగూటికి చేరనీయక
ఆదరించే వారు లేక సేద తీరే నీడ లేక
ముందుచూపుగ మానవీయం నీకు భద్రత కల్పించనందున
దూరమెంతో తెలిసికూడా  దిక్కుతోచని దీనస్థితిలో
గుండె ధైర్యము జారనీయక కాలి నడకను సడలనీయక
ఆలుబిడ్డలు వెంటరాగ దారిపట్టిన బాటసారీ!
నెత్తిమీద బరువుమూట చంకలోన చంటిబిడ్డ
ఎన్ని రోజులు ఎన్ని మైళ్ళని పగలు రాత్రులు పస్తు నడకలు
నడచి నడచి కాళ్ళు పగిలిన పంటిబిగువన బాధ భరిస్తూ
రోడ్డు మీద బిడ్డ ప్రసవం రైలు కట్టన అయ్య మరణం
దరికి చేరని ప్రయాణంలో అడుగడుగున అవాంతరాలు
బతుకుటెట్లు చేరుటెట్లను బాధ మనసును కలచి వేయగ
ఎవరి కోసం చెమట చిందెనో వారు నిన్ను వదిలి వేసినా
సోనుసూద్ జాలిగుండెలో జాలువారిన దయాగుణమూ
అక్కడక్కడ మానవత్వం పరిమళించి ఆదరించినా
ఛిద్రమైన నీదు బతుకు అనుభవించిన నరకయాతన
కరోనా భారతాన కరుణరసాత్మక విషాదపర్వమే!
దేశప్రగతికి ముందు ముందు అడ్డువచ్చెడి శాపమే!

కప్పగంతు జయరామయ్య
పొందూరు, టంగుటూరు మండలం
ప్రకాశం-జిల్లా -ఫోన్ : 9912117372
జూలై - 2020

Comments